జనగణన విజయవంతం కావాలంటే ప్రజల సహకారం అత్యంత అవసరం.. జోగులాంబ కలెక్టర్
జనగణన విజయవంతం కావాలంటే ప్రజల సహకారం అత్యంత అవసరం.. జోగులాంబ కలెక్టర్
Collector


జోగులాంబ గద్వాల, 11 మే (హి.స.)

జనాభా గణన-2026లో భాగంగా ఈ ఏడాది మొదట ఇళ్ల గణన నిర్వహిస్తున్నందున, ఎన్యుమరేటర్లు నిర్దేశిత వివరాలన్నీ నమోదు చేసుకుని గణనను పకడ్బందీగా నిర్వహించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోనీ లింగంబావి కాలనీ పరిసరాల్లో సోమవారం సంబంధిత బ్లాక్ ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ గణనను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ లో భాగంగా ప్రతి ఇంటిని తప్పనిసరిగా కవర్ చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఎన్యుమరేటర్ తమకు కేటాయించిన బౌండరీపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, మూడు రోజుల్లో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్లు, సందులు, ఇంటి నంబర్లు, లైన్ నంబర్లను స్పష్టంగా గుర్తిస్తూ పెన్సిల్తో మ్యాప్ రూపొందించుకోవాలని సూచించారు.

ఇంటి నంబర్లు, లైన్ నంబర్లను మార్కర్ ఆధారంగా నమోదు చేస్తే భవిష్యత్తులో పరిశీలన, రీవెరిఫికేషన్ సులభమవుతుందని తెలిపారు. తమ బ్లాక్ పరిధిలో రోజుకు కనీసం 20 ఇళ్లను కవర్ చేస్తే నిర్ణీత గడువులోగా ఇండ్ల గణన ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. గణన సిబ్బంది ఇంటింటికి వెళ్లే సమయంలో తప్పనిసరిగా అధికారిక ఐడి కార్డు వేసుకోవాలని, ప్రజల్లో అనుమానాలు లేకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శానిటేషన్ వాహనాలు, వాట్సాప్ గ్రూపులు, మహిళా సంఘాలు, ఆర్పీలు, స్థానిక చానల్స్ ద్వారా గణనపై ప్రజలకు అవగాహన కలిగేలా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్న గణనను కూడా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తరచు పరిశీలించాలన్నారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసిన కుటుంబాల వివరాలను కూడా సరి చూసుకొని సంబంధిత యాప్ లో ఖచ్చితమైన గణాంకాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. జనగణన విజయవంతం కావాలంటే ప్రజల సహకారం అత్యంత అవసరమని, సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande