
జగిత్యాల, 11 మే (హి.స.)
పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల
సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో సోమవారం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆలయాన్ని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు భక్తిరసంతో నిండిపోయాయి. మంత్రి ఆలయానికి చేరుకోగానే ఆలయ అర్చకులు, దేవస్థాన అధికారులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్. అంజనా రెడ్డి మంత్రిని శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డూ ప్రసాదం అందించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో కొండగట్టు ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుండగా, దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు