
హైదరాబాద్, 11 మే (హి.స.)ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన భాజపా శ్రేణుల్లో జోష్ నింపింది. తదుపరి లక్ష్యం తెలంగాణనే అంటూ శ్రేణులు కేరింతలు కొడుతుండగా... మోదీ నోటి నుంచి సైతం అవే మాటలు వెలువడటం వారి ఉత్సాహాన్ని రెట్టింపుచేసింది. సుమారు ఏడు గంటలపాటు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేసిన మోదీ.. వివిధ పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు భాజపా నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక... తొలిసారి మోదీ రాష్ట్రానికి వస్తున్నారంటూ భాజపా నాయకత్వం కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు, దానికి తగ్గట్టుగా బహిరంగ సభకు జనాన్ని సమీకరించింది.
పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో భారీ విజయంతో ఇక అధిష్ఠానం దృష్టి తెలంగాణపైనే అని రాష్ట్ర భాజపా నాయకులు ధీమాతో ఉన్నారు. తెలంగాణలో తదుపరి ప్రభుత్వం భాజపాదేనంటూ బహిరంగ సభలో మోదీ ధీమాగా పేర్కొనడం వారిలో విశ్వాసాన్ని మరింత పెంచింది. ‘అబ్కీ బార్ తెలంగాణ..’ అంటూ నినాదాలు చేయించడం ద్వారా కార్యకర్తల్లో నమ్మకం కల్పించడానికి మోదీ ప్రయత్నించారు. సికింద్రాబాద్ ప్రాంతంలో ఎటు చూసినా కాషాయ వర్ణమే కనిపించింది. ప్రధాని పరేడ్ మైదానంలోకి వస్తుండగానే వేల మంది కార్యకర్తలు, కళాకారులు డప్పు చప్పుళ్లు, తెలంగాణ సంస్కృతితో ఘన స్వాగతం పలికి తమ అభిమానం చాటుకున్నారు. మొత్తంగా ఆశించిన స్థాయిలో సభ విజయవంతమైందని భాజపా వర్గాలు సంతృప్తి వ్యక్తంచేశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్