
హైదరాబాద్, 11 మే (హి.స.)రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం తప్పనిసరి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. తెలంగాణ హక్కుల కోసం తాము కేంద్రంతో పోరాడుతామని వ్యాఖ్యానించారు. ఈరోజు(సోమవారం) సీఎం రేవంత్రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ చిట్చాట్లో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ విధానాలు, రాష్ట్ర అభివృద్ధి, మావోయిస్టుల సరెండర్లు, మహిళా రిజర్వేషన్లు, రీజినల్ రింగ్ రోడ్, బండి భగీరథ్ కేసు వంటి అనేక కీలక అంశాలపై స్పందించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న(ఆదివారం) హెచ్ఐసీసీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. హెచ్ఐసీసీలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాను ప్రస్తావించిన అభివృద్ధి అంశాలను ప్రధాని మోదీ అంగీకరించారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర సహకారం అవసరమని, అదే విషయాన్ని మోదీ దృష్టికి తాను తీసుకెళ్లానని చెప్పుకొచ్చారు. ‘నేను బీజేపీని ఓడించిన ముఖ్యమంత్రిని. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందే’ అని వ్యాఖ్యానించారు.
రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం 50 శాతం నిధులు ఇవ్వాలని కోరామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మెట్రో, సదరన్ పార్ట్ రీజినల్ రింగ్ రోడ్ వంటి కొన్ని ప్రాజెక్టులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఎయిర్పోర్ట్ క్లియరెన్స్లు, డిఫెన్స్ ల్యాండ్స్, మూసీ ప్రాజెక్టుకు ఏడీబీ నిధులు, నేషనల్ హైవేలకు అనుమతులు వచ్చినట్లు వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ పనులు ఆలస్యమయ్యాయని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్