మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించాలంటూ రైతుల రాస్తారోకో
మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించాలంటూ రైతుల రాస్తారోకో
Farmer


మహబూబాబాద్, 11 మే (హి.స.)

తొర్రూరు వ్యవసాయ మార్కెట్ పరిధిలో మొక్కజొన్న కొనుగోళ్లు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో రైతులు సోమవారం రోడ్డెక్కారు. మొక్కజొన్నతో పాటు వరి కొనుగోళ్లు కూడా సక్రమంగా జరగకపోవడంతో ఆగ్రహించిన రైతులు తొర్రూరు-మహబూబాబాద్ ప్రధాన రోడ్డుపై సోమవారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డు పై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 40 రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే ఘనంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ, ఇప్పటి వరకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదని రైతులు ఆరోపించారు. ముఖ్యంగా కొనుగోళ్ల కోసం అవసరమైన కాంటాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తమ పంటలను మార్కెట్ యార్డులోనే నిల్వ ఉంచి రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యం, మొక్కజొన్న వర్షాలకు తడిసి నాణ్యత కోల్పోతుండటంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఇప్పటికే పలుమార్లు కురిసిన వర్షాలకు కొంత ధాన్యం తడిసి ముద్దగా మారిందని, అయినప్పటికీ ఆ ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట పండించడానికి చేసిన ఖర్చులు కూడా రావడం లేదు. అప్పులు చేసి సాగు చేశాం. ఇప్పుడు కొనుగోళ్లు ఆలస్యం కావడంతో తీవ్ర నష్టాలు వస్తున్నాయి. వర్షాలకు ధాన్యం పూర్తిగా పాడయ్యే పరిస్థితి ఏర్పడింది అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకో కారణంగా ఇరు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande