
కడప, 11 మే (హి.స.)
కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ వద్ద ఘర్షణపై జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సీరియస్ అయ్యారు. డ్రగ్స్, గంజాయి తీసుకుని ఆ మత్తులో ఈ ఘర్షణకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ రాకేశ్ చంద్రను జిల్లా కలెక్టర్ శ్రీధర్ బాధ్యతల నుంచి తప్పించారు.
కడపలోని అల్మాస్పేట సర్కిల్ పేరు మార్పు వివాదానికి దారితీసింది. అల్మాస్పేట సర్కిల్ను టిప్పుసుల్తాన్ సర్కిల్గా మార్చాలంటూ ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ సర్కిల్ పక్కనే ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. మే 12వ తేదీ హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన 31 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అందుకోసం ఈ సర్కిల్ వద్ద భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
ఆ ఫ్లెక్సీ అల్మాస్పేటను హనుమాన్ సర్కిల్ అంటూ రాశారు. ఇది అసలు వివాదానికి కారణమైంది.
ఇటివల ఇరువర్గాలు.. పోటాపోటీగా ఆందోళనలు చేపట్టాయి. దాంతో ఆయా వర్గాలు రాళ్ల దాడి చేసుకున్నాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఇరు వర్గాల వారిని చెరదగొట్టారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. అందులో పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ను బాధ్యతల నుంచి తప్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV