
నెల్లూరు,, 11 మే (హి.స.)ఈనెల13న ప్రారంభమయ్యే పార్టీ మహానాడుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం జరగనున్న కిసాన్ సేజ్ ప్రాంతాన్ని ఈ రోజు సోమవారం పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పరిశీలించారు.
సభాప్రాంగణం, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష చేశారు. మూడు రోజుల పాటు జరిగే మహానాడులో కీలక తీర్మానాలు చేస్తారని మంత్రి నారాయణ తెలిపారు.
'మహానాడు సుపరిపాలనకు దోహదపడే విధంగా నిర్వహించాలి. తొలి రెండు రోజులు పార్టీ డెలిగేట్స్తో, మూడో రోజు బహిరంగ సభగా జరగనుంది. బహిరంగ సభకు 7 లక్షల మందికి పైగా ప్రజలు రాబోతారని అంచనా. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. కమిటీల ప్రతినిధుల సమావేశంలో బాధ్యతలపై దిశా నిర్దేశం చేస్తాం. మహానాడును చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తాం' అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ..'సభా ప్రాంగణం, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించాం. మహానాడుకు సుమారు 6 వేల బస్సులు రావచ్చని అంచనా. పోలీసులు భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. తెలుగు ప్రజల పండగ అయిన మహానాడును నిర్వహించే తొలి అవకాశం నెల్లూరు జిల్లాకు దక్కింది' అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV