
అల్లూరి సీతారామరాజు జిల్లా, 11 మే (హి.స.)
ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో గత కొంతకాలంగా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న పొడియం లక్ష్మి అలియాస్ లక్మే, అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాకు చెందిన ఆమె, మావోయిస్టు పార్టీలోని కీలకమైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యురాలిగా ఉంటూ అగ్రనేత హిడ్మా రక్షణ దళంలో పనిచేశారు. ప్రభుత్వం ఆమెపై 5 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది.మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల విరక్తి చెందడం, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ఆకర్షణీయమైన పునరావాస పథకాలకు ప్రభావితమై ఆమె జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. ఎటపాక భద్రతా క్యాంపులో పోలీసు అధికారుల సమక్షంలో తన ఆయుధాలను అప్పగించి లొంగిపోయారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ఆమెకు తక్షణ సహాయం అందజేయడం జరిగింది. హింసా మార్గాన్ని వీడి బయటకు వచ్చే మావోయిస్టులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ఈ సందర్భంగా పోలీసులు పునరుద్ఘాటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi