
అమరావతి, 12 మే (హి.స.)
ఏపీలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 24 గంటల్లోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తి చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. వాహనదారులకు వేగవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. డీలర్ టెంపరరీ రిజిస్ట్రేషన్ అనంతరం 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్కు ఆమోదం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఫ్యాన్సీ నంబర్ వాహనాలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని మంత్రి తెలిపారు. గడువులోపు సంబంధిత అధికారులు స్పందించకపోతే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఆమోదం అయినట్లు పరిగణించనున్నట్లు తెలిపారు. సెలవు రోజుల్లో కూడా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ను ఆమోదిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టనున్నట్లు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, సులభంగా సేవలు అందించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ కొత్త విధానం అమలు చేయనున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ