
అమరావతి, 12 మే (హి.స.):గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. తమపై రాళ్లు రువ్విన దొంగలపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. పొన్నూరు సమీపంలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే.. సోమవారం రాత్రి రైల్వే పోలీసులు పొన్నూరు సమీపంలో గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దొంగలు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో రైల్వే పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. భయపడిపోయిన దొంగలు అక్కడినుంచి పారిపోయారు. ఆలూరు - కొండముడి మధ్య రైల్వే ట్రాక్పై ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. సమాచారం అందుకున్న పొన్నూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గతంలో ఇదే మార్గంలో అప్పికట్ల వద్ద రైలులో చోరీ జరిగినట్లు తెలుస్తోంది.
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుక్మాపూర్ రైల్వేస్టేషన్ వద్ద రైల్వే ట్రాక్ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్న మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన మహారాష్ట్ర పోలీసులు ఆదివారం అర్ధరాత్రి నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురు మావోయిస్టులను ఛత్తీస్గఢ్ గడ్చిరోలి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాల నిఘా పెరగడంతో మావోయిస్టులు తప్పించుకుని ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. కూలీల అవతారం ఎత్తిన వారిని తాండూరు పోలీసుల సహకారంతో మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు తీసుకెళ్లిపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ