
విజయవాడ, 12 మే (హి.స.)
, ఇంద్రకీలాద్రిపై హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు(మంగళవారం) ఉదయం నుంచే ఆంజనేయ స్వామికి అభిషేకాలు, నాగవల్లి దళార్చన, ఆకుపూజలు నిర్వహించారు. నాలుగు ప్రధాన వేదికలపై హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఘాట్ రోడ్, ప్రధాన ఆలయం, మెట్ల మార్గం, సీతానగరం ఉపాలయాల్లో వేడుకలు నిర్వహించారు.
ఆంజనేయ స్వామికి వేద పండితులు తమలపాకులతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకలకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. హనుమ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగింది. వేడుకల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఆలయాలను రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ