
హైదరాబాద్, 12 మే (హి.స.)
హనుమాన్ జయంతి సందర్భంగా
కర్మన్ ఘాట్లోని ప్రాచీన శ్రీ ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. హనుమంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మంగళవారం రోజునే హనుమాన్ జయంతి రావడంతో ఈ వేడుకలకు మరింత విశిష్టత చేకూరింది. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. వడమాలలు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా జై శ్రీరామ్”, “జై హనుమాన్ నినాదాలతో మార్మోగి భక్తిమయ వాతావరణాన్ని సృష్టించింది.
హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, మహామంగళహారతులు నిర్వహించగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసి, సజావుగా దర్శనం జరిగేలా చర్యలు చేపట్టింది. ప్రసాదాల పంపిణీ, సేవా కార్యక్రమాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికోత్సాహంతో నిండిపోయాయి. హనుమాన్ జయంతి వేడుకలు భక్తుల్లో భక్తి, శక్తి, ధైర్యం, స్ఫూర్తిని నింపాయని పలువురు అభిప్రాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు