ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై కూడా చర్యలు.. సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 12 మే (హి.స.) మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణలో ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ సచివాలయంలో ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) నిర్వహించి మొక్కజొన
Cm


హైదరాబాద్, 12 మే (హి.స.)

మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం

సేకరణలో ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ సచివాలయంలో ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) నిర్వహించి మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఏ మేరకు జరుగుతుందనే వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. ముఖ్యంగా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పర్యవేక్షించాలని సూచించారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల్లోగా గోడౌన్లకు తరలించాలని సీఎం ఆదేశించారు. ధాన్యం లోడింగ్కు ఒప్పందం ప్రకారం సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు (Criminal Cases) పెట్టేందుకు కూడా వెనకాడొద్దని అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని రవాణా శాఖ కమిషనర్ను ఆదేశించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలని అన్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం

వెనకాడదని తెలిపారు. గోడౌన్ల సమస్య ఉన్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

అదేవిధంగా ధాన్యం నిల్వ చేసేందుకు రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను సేకరించి, ధాన్యాన్ని అక్కడికి తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వీలును బట్టి అక్కడి నుండి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలు ఉండాలన్నారు. మొక్కజొన్న సాగు ఎక్కువగా ఉన్న జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఆదేశించారు. అవసరమైన చోట పోలీసుల సాయం తీసుకుని ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలా చూడాలని, కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు సీఎస్ రామకృష్ణా రావుకు నివేదిక పంపాలని సీఎం రేవంత్ ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande