
విశాఖపట్నం, 12 మే (హి.స.)ఉత్తర శ్రీలంక తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడనుంది. భారత వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థతోపాటు ఇతర వాతావరణ మోడళ్ల అంచనా ప్రకారం.. రానున్న రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించి 16వ తేదీ తరువాత అక్కడ వాయుగుండంగా బలపడనుంది. వాయవ్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నందున అల్పపీడనం బంగాళాఖాతంలోనే తూర్పు వైపు పయనిస్తుందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. దీని ప్రభావం కోస్తా, రాయలసీమలపై పెద్దగా ఉండదన్నారు. అక్కడక్కడా వర్షాలు పడతాయన్నారు. 16వ తేదీ తరువాత వాయుగుండంగా మారనున్నందున అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రం పరిసరాల్లోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు వెల్లడించారు. 17వ తేదీ నుంచి 2-3 రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణ, ఉత్తర కర్ణాటకల్లో వడగాడ్పులు వీయడంతో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు అటుఇటుగా నమోదవుతాయన్నారు. సోమవారం కోస్తా, సీమల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. వాతావరణ అనిశ్చితితో పలుచోట్ల వర్షాలు కురిశాయి.
ఈ వారం చివరినాటికి అంటే.. 17వ తేదీకల్లా అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ సోమవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా మే 20 నాటికి అండమాన్ నికోబార్ దీవులను
అల్పపీడనం ప్రభావంతో మంగళవారం కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు పడతాయని పేర్కొంది. అల్లూరి, పోలవరం జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని వివరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ