
హైదరాబాద్, 12 మే (హి.స.) మావోయిస్టు పార్టీకి మరో గట్టి
ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో అత్యంత కీలకమైన కేంద్ర కమిటీ (Central Committee) సభ్యుడిగా కొనసాగుతున్న పసునూరి నరహరి అలియాస్ సంతోష్ (Pasunuri Narahari) (Santhosh) తన భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దశాబ్దాల పాటు అడవిలో గెరిల్లా పోరాటం చేసిన ఓ అగ్రశ్రేణి నేత జనజీవన స్రవంతిలోకి రావడం పార్టీ కేడర్లో చర్చనీయాంశమైంది. హన్మకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని సోమిడి గ్రామానికి చెందిన చెందిన పసునూరి నర్సమ్మ-సోమనారాయణకు ఐదుగురు కొడుకులు. అందులో రెండో కుమారుడు నరహరి. 1980 సంవత్సరంలో ఎల్బీ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా మావోయిస్టు ఉద్యమాలు, విధానాలకు ఆకర్షితుడయ్యాడు. అప్పటి మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతిరణదేవ్ అలియాస్ బక్కన్నతో ఏర్పడిన సాన్నిహిత్యం నరహరిని ఉద్యమం వైపునకు వెళ్లేలా చేసింది. గ్రామంలో ఉంటూ కూలీల రేట్లు పెంచడంతో పాటు భూస్వాములు, రౌడీలకు వ్యతిరేకంగా ఆయన తిరుగుబావుట ఎగురవేశారు. అప్పటి ఆస్ఈసీలో ఉన్న ఉద్యమ నాయకుల మాటలతో ప్రభావితమైన నరహరి పోలీసుల నిర్బంధం పెరగడంతో అడవి బాటపట్టారు. పసునూరి నరహరి గత కొన్ని దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. క్రమంగా పార్టీలో అంచలంచెలుగా ఎదుగుతూ.. కీలకమైన కేంద్ర కమిటీ సభ్యుడిగా, జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వస్తున్నారు. ఆయన భార్య ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ కాగా, ఆమె కూడా పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్నట్లుగా సమాచారం.
అయితే, తాజాగా జార్ఖండ్ (Jharkhand)లోని సరండా (Saranda) అడవుల్లో భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా (Misir Besra) లక్ష్యంగా పోలీసులు వేటను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అడవుల్లో భద్రతా బలగాల ఒత్తిడి పెరగడం, మరోవైపు అనారోగ్య కారణాల రీత్యా నరహరి దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్ అడవుల నుంచి రహస్యంగా తెలంగాణకు చేరుకున్న వీరు.. తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోయారు.
మావోయిస్టు పార్టీ సిద్ధాంతకర్తల్లో ఒకరిగా, వ్యూహకర్తగా పేరున్న నరహరి లొంగుబాటు పార్టీకి పెద్ద లోటుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కీలక నేతలు ఒకరి తర్వాత ఒకరు లొంగిపోతుండటంతో మావోయిస్టు పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. నరహరి దంపతుల లొంగుబాటుకు సంబంధించిన అధికారిక వివరాలను ఇవాల పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..