
నాగర్ కర్నూల్, 12 మే (హి.స.)
నాగర్ కర్నూల్ జిల్లా .కొల్లాపూర్ పట్టణంలోని మాతా శిశు
సంరక్షణ ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, బాలింతల రవాణా కష్టాలు ఇక తీరనున్నాయి. వారి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాన్ని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ప్రారంభించారు. పట్టణంలోని ప్రయాణ ప్రాంగణం(బస్టాండ్) నుంచి రామాపురం శివారులో ఉన్న మాతా శిశు సంరక్షణ ఆస్పత్రికి వెళ్లేందుకు రోగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని ఈ వాహనాన్ని సమకూర్చారు.
హైదరాబాద్కు చెందిన 'గుడ్ యూనివర్స్' సామాజిక సేవా సంస్థ, 'ఆర్సేసియం' సంస్థల సహకారంతో ఈ పర్యావరణహిత వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు ఈ ఉచిత రవాణా సౌకర్యం ఎంతో ఊరటనిస్తుందన్నారు. సురక్షితమైన, సులభతరమైన ప్రయాణాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన సేవా సంస్థలను మంత్రి జూపల్లి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాన్ని నడిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు అనుష్క, వంశీ, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం, కౌన్సిలర్లు సుజాత, కర్ని శివ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు