
వరంగల్, 12 మే (హి.స.)
వరంగల్లో చైన్ స్నాచర్లు
రెచ్చిపోతున్నారు. నగరంలోని కాలనీలలో ఇంటి ముందు కూర్చున్న వారిని కూడా వదిలిపెట్టడం లేదు. బైకులపై వచ్చి మెడలో ఉన్న చైన్స్ లాక్కెళ్తున్నారు.
ఒక్కొక్క బైక్ పై ఇద్దరు లేదా ముగ్గురు వచ్చి బంగారు చైన్లు తెంపుకొని వెళ్తున్నారు. వరంగల్ లో మూడు చోట్ల సోమవారం రాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. ఇంటి ముందు కూర్చున్న వారిని టార్గెట్ చేసి మెడలో నుంచి చైన్లను ఎత్తుకెళ్లిపోయారు. వరంగల్లోని కాసిబుగ్గ సొసైటీ కాలనీలోని రోడ్ నెంబర్-3లో రాత్రి దీపా శ్రీ అనే మహిళ ఇంటి బయట పిల్లలకు అన్నం తినిపిస్తుండగా పల్సర్ బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు మెడలో చైన్ ను లాక్కెళ్లారు.
చూస్తుండగానే కళ్లముందే చైన్ తెంపుకు పోవడంతో ఆ మహిళ మొత్తుకోగా పక్కన ఉన్న ఇళ్ల వారు వచ్చేలోపే దొంగలు పారిపోయారు. నగరంలోని క్రిస్టియన్ కాలనీలో అడ్వకేట్ మైదం వివేక్ ఇంటి ముందు కూర్చోనుండగా పల్సర్ బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు మెడలో చైన్ లాక్కెళ్లారు. కాలనీలో తిరుగుతూ ఎవరూ లేని సమయంలో లాక్కెళ్లారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నైమ్ నగర్ లోని లోటస్ కాలనీలో రాత్రి మహిళ మెడలోంచి మూడు తులాల చైన్ ను లాక్కెళ్లారు.
పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు గొలుసును తెంపుకెళ్లారు. మూడు చోట్ల సోమవారం రాత్రి ఒకే తీరున చైన్ స్నాచింగ్ జరగడంతో పలు కాలనీలో ఆందోళన నెలకొంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైన్ స్నాచింగ్ వల్ల లాయర్ వివేక్ కు కొంత గాయం కాగా ఆసుపత్రిలో చికిత్స చేశారు. పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. వరంగల్ లో ఒకే రోజు మూడు చోట్ల జరగడంతో
పోలీసులు కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో పలు చోట్ల చైన్ స్నాచింగ్ జరగడం వల్ల సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు