
భద్రాద్రి కొత్తగూడెం, 12 మే (హి.స.)
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా హనుమాన్ భక్తుల కారు ప్రమాదానికి గురైంది. బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ వెస్ట్ గేట్ సమీపంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. జామాయిల్ కర్రల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను వెన్నుక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లాకు చెందిన భక్తులు భద్రాచలంలో స్వామివారిని ఐదుగురు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వారు తమ ఎర్టీగా కారులో(ఏపీ 28 సీహెచ్ 5607) తిరుగు ప్రయాణమయ్యారు.
సరిగ్గా సారపాక ఐటీసీ వెస్ట్ గేట్ వద్దకు చేరుకోగానే,జామాయిల్ పుల్లలతో ఉన్న ట్రాక్టర్ (టీఎస్ 04 ఈయు 0427) యూటర్న్ తీసుకుంటోంది. ఈ క్రమంలో వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారంతా సిద్దిపేట వాస్తవ్యులుగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ఇద్దరికి తల భాగంలో బలమైన దెబ్బలు తగలడంతో విపరీతంగా రక్తస్రావమై, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మిగిలిన ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులను కారులో నుంచి వెలికితీశారు. హుటాహుటిన వారిని 108 అంబులెన్స్లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందుతోంది. బూర్గంపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. జామాయిల్ కర్ర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అకస్మాత్తుగా మలుపు తిరగడం వల్లే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు