
కడప, 12 మే (హి.స.)మన కడప - స్వచ్ఛ కడప కార్యక్రమంలో భాగంగా, ఈ రోజు మంగళవారం ఉదయం 37వ డివిజన్ వక్కలపేట, ఎర్రబడి స్కూల్ వద్ద ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ నేత శ్రీనివాస రెడ్డి పర్యటించారు.
వీధులు, కాలువల్లో చేపట్టిన పారిశుధ్య పనులను వారు స్వయంగా పరిశీలించారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. నగర పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు ప్రజలను కోరారు.
*మన పరిసరాల పరిశుభ్రత - మన బాధ్యత* అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ, వార్డులోని పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా అధికారులతో కలిసి ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ నేత శ్రీనివాస రెడ్డి ఈ మాస్ శానిటేషన్ డ్రైవ్లో స్వయంగా పాల్గొన్నారు.
ప్రతి వీధిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థాల నిర్వహణ మరియు తాగునీటి సరఫరా వంటి అంశాలపై స్థానికులను కలిసి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య లోపాలు ఎక్కడ ఉన్నా వెంటనే సరిచేయాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. నగర సుందరీకరణ కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, స్వచ్ఛ కడప దిశగా అడుగులు వేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి రెడ్డి పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV