
తిరుమల, 12 మే (హి.స.)
తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ భారీగా తగ్గింది. వారాంతాల్లో మినహా మిగిలిన రోజుల్లో భక్తుల రద్దీ సాధారణం కంటే చాలా తక్కువగా నమోదవుతోంది. వేసవి సెలవుల్లో భక్తులు భారీగా తరలివస్తారని టీటీడీ అంచనా వేసింది. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. భాగంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడంతో పాటు, రద్దీని క్రమబద్ధీకరించేందుకు రింగురోడ్డులో అదనపు క్యూలైన్లను కూడా నిర్మించారు. అయితే, గత కొన్ని రోజులుగా పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. సోమవారం వంటి రోజుల్లో కూడా క్యూలైన్లు ఖాళీగా ఉండటంతో, సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి నిరీక్షణ లేకుండా నేరుగా స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలుగుతోంది. భక్తుల రద్దీ తగ్గడం వల్ల వసతి సౌకర్యాల విషయంలో కూడా సామాన్యులకు ఊరట లభిస్తోంది.
సాధారణంగా వీఐపీ సిఫారసు లేఖల ఒత్తిడి ఎక్కువగా ఉండే శ్రీపద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ ప్రాంతాల్లో గదులకు డిమాండ్ గణనీయంగా తగ్గింది. సిఫారసు దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో అక్కడ గదులు ఖాళీగా ఉంటున్నాయి. ఈ క్రమంలో, తితిదే అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మిగిలిపోతున్న ఆ గదులను దర్శన టికెట్లు కలిగి ఉన్న సాధారణ భక్తులకు కేటాయించే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల వేసవి ఎండల్లో వసతి కోసం ఇబ్బందులు పడకుండా భక్తులు హాయిగా గదులు పొందే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతానికి సాయంత్రం వేళల్లో కంపార్ట్మెంట్లు కొంత మేర నిండుతున్నప్పటికీ, గతంతో పోలిస్తే దర్శన సమయం చాలా వరకు తగ్గింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV