జనగణనతోనే అభివృద్ధికి బలమైన పునాది: ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు
జనగణనతోనే అభివృద్ధికి బలమైన పునాది: ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు
Mla


వరంగల్, 13 మే (హి.స.)

జనగణనతోనే అభివృద్ధికి బలమైన పునాది అని అందరూ తప్పక వివరాలు నమోదు చేసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు పిలుపునిచ్చారు. జనగణన 2027 లో ప్రతి పౌరుడు స్వయంగా తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకునేలా బుధవారం హనుమకొండ నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు.

జన గణన కేవలం లెక్కల ప్రక్రియ మాత్రమే కాకుండా భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలకు పునాది అన్నారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన నిర్వహించడం ప్రభుత్వాల ముఖ్య బాధ్యత అన్నారు.

ప్రజల జీవన పరిస్థితులు, అవసరాలు, అభివృద్ధి సూచికలను అంచనా వేయడంలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా ఆలస్యమైన జనగణన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందన్నారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ, జనగణన దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రక్రియ అని అన్నారు.

సరైన జనాభా లెక్కల ఆధారంగానే వచ్చే పది సంవత్సరాల ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు రూపొందించబడతాయని పేర్కొన్నారు. ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల వద్ద అధికారిక గుర్తింపు కార్డులు ఉంటాయని, ప్రజలు నమ్మకంతో వివరాలు అందించాలని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తిచేసిన వారు తమ ఐడీని ఎన్యూమరేటర్కు తెలియజేయాలన్నారు. దీంతో డేటా వెరిఫికేషన్ వేగంగా పూర్తవుతుందని తెలిపారు. జనగణన విజయవంతం కావడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande