
వనపర్తి, 13 మే (హి.స.)
సింగోటం- గోపాలదిన్నె లింక్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేసి, చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు ప్రస్తుత మార్కెట్ ధర కంటే మూడింతల పరిహారం అందేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామంలోని రైతు వేదిక వద్ద సంగినేనిపల్లీ, తూముకుంట, బొల్లారం గ్రామాలకు చెందిన భూ బాధిత రైతులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమై, వారి అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మార్కెట్ విలువ రూ.1,87,500 తక్కువగా ఉందంటూ రైతులు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. బేసిక్ మార్కెట్ విలువను తక్షణమే రెండింతలు పెంచి రూ.3,75,000గా ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పెంచిన విలువ (రూ.3,75,000) ఆధారంగా భూసేకరణ చట్టం ప్రకారం మూడింతల పరిహారంతో పాటు, గెజిట్ ప్రచురించిన నాటి నుంచి వడ్డీని కూడా కలిపి ఎకరాకు మొత్తం రూ.11,50,000 చొప్పున చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పై రైతులు హర్షం వ్యక్తం చేశారు. తక్షణమే అవార్డు కాపీలు మంజూరు చేసి పరిహార పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆర్డీవో సుబ్రహ్మణ్యాన్ని మంత్రి ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు