ఇసుక దందాపై కలెక్టర్ కొరడా.. సీసీఎస్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు
ఇసుక దందాపై కలెక్టర్ కొరడా.. సీసీఎస్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు
కలెక్టర్


నిజామాబాద్, 13 మే (హి.స.)

జిల్లాలో అడ్డగోలుగా జరుగుతున్న అక్రమ ఇసుక, మొరం అక్రమ రవాణా దందాపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్యలు స్సెషల్ ఫోకస్ పెట్టారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా అమల్లోకి తెచ్చిన మన ఇసుక యాప్ ను కూడా ఇసుక మాఫియా అధికారుల (ఇంటి దొంగలు) సహకారంతో అడ్డగోలుగా వాడేసుకుంటున్నారు. ఇసుక యాప్ ను, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అడ్డంపెట్టుకుని వాటి పేరు పై అక్రమ దందాకు తెరలేపారు.

తహసీల్దార్లకు ఎన్ని ఆదేశాలిచ్చినా, ఎంత గట్టిగా చెప్పినా ఇసుక మాఫియాతో రెవెన్యూ యంత్రాంగానికి ఉన్న కరెన్సీ బంధం కారణంగా ఇసుక అక్రమ రవాణాకు ఆశించిన విధంగా అడ్డుకట్ట పడటం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టే విధంగా అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్న ఇసుక, మొరం, నల్లమట్టి అక్రమ రవాణా దందా యథేచ్ఛగా నడుస్తోంది. అయితే ఇసుక మాఫియా వెన్ను విరిచేలా కలెక్టర్ సీరియస్ యాక్షన్ లోకి దిగారు. పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య సైతం ఇసుక రీచ్ ల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాల పై మెరుపు దాడులు నిర్వహించి పదుల సంఖ్యలో వాహనాలను సీజ్ చేస్తూ అక్రమ దందా చేసే వ్యాపారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande