
అనంతపురం, 13 మే (హి.స.): అనంతపురంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా ప్రజా సమస్యలను పరిష్కరించడం కంటే వైసీపీని విమర్శించడంపైనే దృష్టి పెట్టిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.రెండేళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల 60 వేల కోట్ల అప్పు చేసిందని, ఆ డబ్బు ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు స్పష్టత లేదన్నారు. జగన్ ప్రభుత్వంపై పది లక్షల కోట్ల అప్పు చేశారంటూ టీడీపీ దుష్ప్రచారం చేసిందని విమర్శించారు.
వాస్తవానికి జగన్ హయాంలో చేసిన అప్పు రూ.3 లక్షల 30 వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తాము డిమాండ్ చేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. జగన్ పాలనలో డీబీటీ ద్వారా ప్రజలకు రూ.4 లక్షల 50 వేల కోట్ల నేరుగా లబ్ధి చేకూర్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వ్యవస్థ పూర్తిగా నీరుగారిపోయిందని, నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ ప్రభుత్వం పోలీసు శాఖను అడ్డుపెట్టుకొని పరిపాలన సాగిస్తోందని, ప్రజా సమస్యలు బయటకు రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. రైతాంగ సమస్యలపై కనీస సమీక్ష కూడా నిర్వహించడం లేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు స్థిరీకరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, అనంతపురం పట్టణంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. అమరావతి ఇప్పుడు చంద్రబాబుకు క్రెడిట్ కార్డుగా మారిందని అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV