
హైదరాబాద్, 24 మే (హి.స.)
హైదరాబాద్లోని మాదాపూర్లో అర్ధరాత్రి
పోకిరీల హంగామా కలకలం రేపింది. నీలోఫర్ వద్ద కార్లు, బైక్లతో కొందరు యువకులు రోడ్లపై రేసింగ్కు పాల్పడ్డారు. వీకెండ్ కావడంతో అర్ధరాత్రి సమయంలో రోడ్లపై వేగంగా దూసుకెళ్తూ రేసింగ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినా రేసర్లు పట్టించుకోకుండా పోలీసుల వైపునకు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు వెంటాడి వారిని పట్టుకున్నారు. ఆపాలని హెచ్చరించినప్పటికీ కొందరు కార్లలో వేగంగా పారిపోవడానికి ప్రయత్నించారు. రేసింగ్ చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసిన వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని వాహనాలు పోలీసులపైనే దూసుకువచ్చే ప్రయత్నం చేయగా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఓ కారు అద్దాలను పగులగొట్టి లోపల ఉన్న వారిని బయటకు తీసుకుని అదుపులోకి తీసుకున్నారు. వీకెండ్ వస్తే చాలు నగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి రేసింగ్లు, హంగామాలు పెరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..