వరి కొనుగోళ్ల ఆలస్యానికి కేంద్రమే కారణం.. ఖమ్మం జిల్లా గోదావరి కల సాకారం కాబోతోంది: తుమ్మల
వరి కొనుగోళ్ల ఆలస్యానికి కేంద్రమే కారణం.. ఖమ్మం జిల్లా గోదావరి కల సాకారం కాబోతోంది: తుమ్మల
వరి కొనుగోళ్ల ఆలస్యానికి కేంద్రమే కారణం.. ఖమ్మం జిల్లా గోదావరి కల సాకారం కాబోతోంది: తుమ్మల


ఖమ్మం, 25 మే (హి.స.)

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిప్పికొట్టారు. ఖమ్మం జిల్లాలోని యాతాలకుంట టన్నెల్ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... దేశంలో అన్ని రకాల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడానికి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు విధానాలే కారణమని ధ్వజమెత్తారు.

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల రాష్ట్రానికి గన్నీ బ్యాగులు తీసుకురాలేని పరిస్థితి ఏర్పడిందని, రవాణాకు అవసరమైన డీజిల్ కొరత వల్ల ఎక్కడికక్కడ ధాన్యం నిలిచిపోయిందని ఆరోపించారు. కేంద్రం ఇలాంటి ఇబ్బందులు సృష్టిస్తుంటే, సిగ్గులేకుండా బీజేపీ నేతలు బస్సుయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, చివరి గింజ వరకు కొంటామని భరోసా ఇచ్చారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్, బీజేపీ నేతలకు లేదన్నారు.

ఇక సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ... ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందించడం తన జీవిత ఆశయమని, చిరకాల వాంఛ అని పేర్కొన్నారు. గత కేసీఆర్ హయాంలో యాతాలకుంట టన్నెల్ పూర్తి చేయడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి రాజీవ్ లింక్ కెనాల్కు, ఆ తర్వాత యాతాలకుంట టన్నెల్కు అనుమతులు ఇచ్చారని, కేవలం 15 నెలల్లోనే రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.

ఆగష్టు 15వ తేదీ లోగా లైనింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అటు సాగర్ ఆయకట్టు, ఇటు సీతారామ ఆయకట్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కృష్ణా-గోదావరి జలాలతో త్వరలోనే సస్యశ్యామలం కాబోతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande