
హైదరాబాద్, 25 మే (హి.స.)
తెలంగాణ - కర్ణాటక రాష్ట్రాల మధ్య
ఇరిగేషన్ అంశాలపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బోస్ రాజ్ లు సోమవారం సచివాలయంలో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి ఒప్పందాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు తాగు, సాగునీటి సరఫరాపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగకుండా ప్రాజెక్టుల రూపకల్పన ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరస్పర అవగాహనతోనే కృష్ణాజలాల వినియోగం, అంతర్రాష్ట్ర సమన్వయంతో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం ఉంటుందన్నారు. వేసవి కాలం లేదా నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లాంటి కరవు పీడిత ప్రాంతాలకు తాగు, సాగు నీటి సరఫరాను క్రమబద్ధీకరించడం ఈ భేటీ ముఖ్య ఉద్దేశ్యం.
కృష్ణా జలాల వివాదాలు లేదా నీటి కొరత సమస్యలను కోర్టులు, గొడవలతో కాకుండా పరస్పర అవగాహన, అంతర్రాష్ట్ర సమన్వయం (Inter-State Coordination) ద్వారానే పరిష్కరించుకోవచ్చు అని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఎండకాలంలో తాగునీటి అవసరాల కోసం అత్యవసరంగా నీటిని విడుదల చేసేలా ఒక స్థిరమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావించారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల ఇన్-ఫ్లో (ఇన్ఫోలు), ఔట్-ఫ్లోల సమాచారాన్ని ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పంచుకోవాలని నిర్ణయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు