
హైదరాబాద్, 24 మే (హి.స.)
వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబర్ పేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో నేడు కేటీఆర్ మాట్లాడుతూ.._ టికెట్ల కేటాయింపుపై ఇప్పటి వరకు తాము ఎవరికి ఎలాంటి వాగ్దానాలు చేయలేదని అన్నారు. ఎవరు ఎక్కువ ఉరుకుతరో... ఎవరు ప్రజల కోసం, పార్టీ కోసం నిలబడతారో వారికే టికెట్లు ఇస్తామన్నారు. ఎమ్మెల్యే చుట్టూ, పెద్ద నాయకుల చుట్టూ తిరిగినవాళ్లకు కాకుండా ప్రజల పరంగా పరపతి ఉన్నవాళ్లకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. అంతే కాకుండా మొదట పొలాల వద్ద ట్రాన్స్ ఫార్మర్లకు మీటర్లు పెడతారట.. తరవాత బావిల దగ్గర ఉండే మోటార్లకు కూడా మీటర్లు పెడతారంట అని వ్యాఖ్యానించారు. ఆనాడు మోడీ కేసీఆర్ పై ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా, కేసీఆర్ మెడపై కత్తిపెట్టినా ఒప్పుకోలేదని చెప్పారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని చెబితే.. మెడ కోసినా నేను పెట్టనని అన్నారని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డిపై కేసులు ఉన్నాయని కాబట్టి ఆయన భయపతున్నారని ఆరోపించారు. అందుకే మోడీ చెప్పిన వెంటనే కేబినెట్ లో ప్రీపెయిడ్ మీటర్లపై రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
కాబట్టి మీటర్లు పెట్టకముందే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు పీకేయాలని అన్నారు. చిత విద్యుత్తు రద్దు కోసమే కాంగ్రెస్ మోటర్లకు మీటర్లను పెడుతుందన్నారు. ప్రీపెయిడ్ మీటర్లతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయబోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్తు పోతుందని ఆనాడే హెచ్చరించామని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు రాబోతున్నాయని కాబట్టి కాంగ్రెస్ కరెంటు కుట్రలను ప్రజలు వ్యతిరేకించాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రీపెయిడ్ మీటర్లను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీసుకురావడం దారుణం అన్నారు. రానున్న మూడు నెలల్లోనే ఉన్న మీటర్లు పీకేసి, ప్రీపెయిడ్ మొబైల్స్ మాదిరి ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లను తీసుకురాబోతున్నదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి, అడుగడుగునా అరాచకాలు, అవినీతికి పాల్పడుతోందని ప్రజలు బుద్ధి చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ప్రజలు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో సగం పూర్తయినా ఇప్పటిదాకా ప్రజలకు గాని, రాష్ట్రానికి గాని కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేక చేతులెత్తేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, పరిపాలనా వైఫల్యాలు, అవినీతిపైన ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు. త్వరలోనే సభ్యత్వ నమోదుకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 1000 మంది పార్టీ కార్యకర్తలకు ఈ శిక్షణ ఇస్తామని చెప్పారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలపై, అన్యాయాలపై ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేస్తున్న తీరు పైన కూడా అవగాహన కల్పిస్తామన్నారు. ఈసారి సభ్యత్వం పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ముందుగా సభ్యత్వ నమోదు, తర్వాత శిక్షణా కార్యక్రమాలు ఉంటాయన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపైన, కాంగ్రెస్ ప్రభుత్వంపైన పోరాటం చేసిన వారికే కార్పొరేటర్ టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు