జిహెచ్ఎంసి ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి.. కేటీఆర్ పిలుపు
జిహెచ్ఎంసి ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి.. కేటీఆర్ పిలుపు
Ktr


హైదరాబాద్, 24 మే (హి.స.)

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్

కార్పొరేషన్ (GHMC) ఎన్నికలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే డిసెంబర్ నెలలోనే నిర్వహించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు, నాయకులు ఇప్పటి నుంచే ఎన్నికల రణరంగానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీకి కంచు కోట అని గుర్తు చేసిన కేటీఆర్, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించి తీరాలన్నారు. డిసెంబర్లో గ్రేటర్ ఎన్నికలు ముగిసిన తర్వాత.. మరో ఏడాది కాలంలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు మనకు అత్యంత కీలకం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వందకు వంద శాతం తెలంగాణలో మనదే అధికారం, బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావడం ఖాయం అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలు స్థానిక సంస్థలకు సంబంధించినవి అయినప్పటికీ.. ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని నాయకులను కేటీఆర్ హెచ్చరించారు. కార్పొరేషన్ ఎన్నికలను సులువుగా (Easy) తీసుకోవచ్చని భావించవద్దని, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో కష్టపడాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో సాధించిన స్థానాల కంటే ఈసారీ అంతకు మించి అత్యుత్తమ ఫలితాలు సాధించడమే మన లక్ష్యంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించే కార్యకర్తలకు, నాయకులకు ఈ ఎన్నికల్లో పూర్తి ప్రాధాన్యత ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. పార్టీని నమ్ముకుని, ప్రజల్లో ఉంటూ కష్టపడే వారిని బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా గుర్తిస్తుంది. వారికి తగిన సమయం వచ్చినప్పుడు పదవులు, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కల్పిస్తాం అని ఆయన హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande