
హైదరాబాద్, 24 మే (హి.స.)
రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్లు మినహా అన్ని విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో చేరాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో శనివారం సమావేశమైన కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కనెక్షన్లు మినహా మిగిలిన అన్ని గృహ, వాణిజ్య కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు.
గత ప్రభుత్వ ఒప్పందాన్నే అమలు చేస్తున్నాం: మంత్రి పొంగులేటి
కేబినెట్ సమావేశం అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, విద్యుత్ నష్టాలను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అయితే, ఈ ఆర్డీఎస్ఎస్ పథకంలో చేరాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi