భానుడి భగభగలు.. జగిత్యాల జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు మృతి
భానుడి భగభగలు.. జగిత్యాల జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు మృతి
Jagityal


జగిత్యాల, 24 మే (హి.స.)

భానుడి భగభగలతో రాష్ట్రం

అల్లాడిపోతోంది. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల్ని ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఉదయం నుంచే తీవ్రమైన ఎండ కొడుతుంటే మిట్ట మధ్యాహ్నం అయితే నిప్పుల కొలిమిలా మారుతుంది. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఎండ తీవ్రతతో రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతుండగా, వడగాలులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హీట్వేవ్ పరిస్థితులపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ జాగ్రత్తలు సూచిస్తున్నప్పటికీ, అత్యవసర అవసరాల కోసం బయటకు వెళ్లిన పలువురు వడదెబ్బకు గురవుతున్నారు.

జగిత్యాల జిల్లాలో గత వారం రోజుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎండల తీవ్రత రోజు రోజుకీ పెరుగుతూ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. మేడిపల్లి మండలం కల్వకోట గ్రామానికి చెందిన కట్కూరి జమున (39) శుక్రవారం సాయంత్రం తీవ్రమైన వడదెబ్బకు గురై మృతి చెందగా, కోరుట్ల రూరల్ మండలం చిన్న మెట్టుపల్లి గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్ (50) గురువారం వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై చికిత్స అందక ముందే ప్రాణాలు కోల్పోయాడు. అలాగే జగిత్యాల పట్టణానికి చెందిన డిష్ టీవీ ఆపరేటర్ జుంబర్తి రాజు (32) ఈనెల 16న గొల్లపల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎండ దెబ్బ తగిలి అక్కడికక్కడే కుప్పకూలగా, 108 సిబ్బంది పరిశీలించి అతను తీవ్ర వడదెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande