హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ అలర్ట్
హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ అలర్ట్
Traffic alert


హైదరాబాద్, 24 మే (హి.స.)

మెహదీపట్నంలో ప్రతిష్టాత్మకంగా

చేపడుతున్న స్మార్ట్ స్కైవాక్ పనులు, అలాగే పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పై సీసీటీవీ కెమెరా పోల్స్ ఏర్పాటు పనుల నేపథ్యంలో నగరంలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మే 24, 25 తేదీలలో (సాయంత్రం 4:00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:00 గంటల వరకు) ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మాసబ్ ట్యాంక్, ఎన్ఎండీసీ, ఎస్.డి కంటి ఆసుపత్రి మీదుగా రేతిబౌలి, నానల్ నగర్ వైపు వెళ్లే ట్రాఫిక్ను, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నెం. 2 & 3 (అజీజియా మసీదు) వద్ద మెరాజ్ కేఫ్ మీదుగా కుడి వైపునకు మళ్లిస్తారు. ఈ వాహనాలు మెహదీపట్నం పిల్లర్ నెం. 15 వద్ద మళ్లీ సాధారణ మార్గంలోకి ప్రవేశించవచ్చు.

టోలిచౌకి, లంగర్హౌస్, అత్తాపూర్ణ నుండి నానల్ నగర్ -రేతిబౌలి మీదుగా మాసబ్ ట్యాంక్ వెళ్లే వాహనాలను పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నెం. 23 వద్ద యూ-టర్న్ చేయించి, వ్యతిరేక దిశలో పంపుతారు. ఆ తర్వాత పిల్లర్ నెం. 4 & 5 వద్ద వాహనాలు సాధారణ మార్గంలోకి చేరుకుంటాయి. మాసబ్ ట్యాంక్ నుండి శంషాబాద్ విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలను ఎస్.డి కంటి ఆసుపత్రి వద్ద లక్ష్మీనగర్ రాంప్ (పిల్లర్ నెం. 77) వైపునకు మళ్లిస్తారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి మెహదీపట్నం వైపు వచ్చే వాహనాలు లక్ష్మీనగర్ రాంప్ (పిల్లర్ నెం. 88) వద్ద ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుంది. పనుల పురోగతిని బట్టి వాహనాలను ఆయా డౌన్ రాంపుల ద్వారా కిందకు అనుమతిస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande