
విజయవాడ,, 25 మే (హి.స.)
ఇశాన్వీ, కేశినేని డెవలపర్స్ సoస్థలు కలిసి చేసిన రియల్ ఎస్టేట్ సంస్థకు ఈడీ అధికారుల నుంచి ఓ నోటీసు వచ్చిందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసి నేని శివనాథ్ (చిన్ని)తెలిపారు. ఆ కంపెనీకి వచ్చిన నోటీసుపై ఈనెల 27వ తేదీన వివరణ ఇస్తామని పేర్కొన్నారు. పక్క పక్క సైట్లు ఉండటంతో రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఇశాన్వీ సంస్థతో 2021లో రియల్ ఎస్టేట్ చేసేందుకు ప్రైడ్ ఇన్ఫ్రా సంస్థ ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఆ సంస్థ ద్వారా రూ.35 లక్షల లావాదేవీలు జరిగాయని తెలిపారు. ఈరోజు (సోమవారం) విజయవాడ వేదికగా కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు.
ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేశాం..
రాజ్ కసిరెడ్డి సంగతి తెలిశాక 2022లోనే.. ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేశామని కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. ఆ లావాదేవీకి సంబంధించే ఈడీ అధికారులు సమాధానం కోరుతూ నోటీసు పంపించారని వెల్లడించారు. ఆర్కిటెక్ ఫీజు కోసం చేసిన రూ.35లక్షల ట్రాన్సాక్షన్ తప్ప ఇంకేమి జరుగలేదనే విషయాన్ని ఈడీ అధికారులకు చెబుతామని తెలిపారు. ఏపీ లిక్కర్ స్కామ్లో తన భార్యకు నోటీసులు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు. అప్పుడు పెట్టిన కంపెనీలో తన భార్య ఓ డైరెక్టర్ మాత్రమేనని తేల్చిచెప్పారు. ఆ కంపెనీకి నోటీసు వచ్చిందే తప్ప.. తన భార్యకు ఎలాంటి నోటీసు రాలేదని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ