
హైదరాబాద్, 25 మే (హి.స.) భూదాన్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ ఇవాళ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయనపై మహేశ్వరం పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఎఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ గతంలో విచారణ ప్రారంభించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే 2024లోనే పలు మార్లు అమోయ్ కుమాన్ు ఈడీ విచారించి వాంగ్మూలం నమోదు చేయగా తాజాగా ఈనెల 25న విచారణకు రావాలంటూ సమన్లు జారీ చేసింది. ఈ నోటీసుల నేపథ్యంలో ఇవాళ ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా అమోయ్ కుమార్ పనిచేసిన సమయంలో 42 ఎకరాల భూదాన్ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన విషయంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. 22 ఏ జాబితాలోని నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా అమోయ్ కుమార్ భారీగా లబ్ధి పొందారని ఈడీ అనుమానిస్తోంది. ధరణిలో ఈ భూములకు సంబంధించి మార్పులు చేర్పులు జరగడం, నిషేధిత జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ తర్వాత పాస్ పుస్తకాలు వచ్చిన అంశంలో ఒక వైపు పోలీసులు మరో వైపు ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. అమోయ్ కుమార్ హయాంలో జరిగిన సేల్ డీడ్లు 1209,1212,4594 విషయంలో అవకతవకలు జరిగాయని ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో కేసు దర్యాప్తు కొనసాగింపు క్రమంలో అమోయ్ కుమార్ ను ఇవాళ మరోసారి విచారిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..