సరస్వతీ అంత్యపుష్కరాలు కాళేశ్వరంలో నెలకొన్న సందడి
సరస్వతీ అంత్యపుష్కరాలు కాళేశ్వరంలో నెలకొన్న సందడి
Pushkaralu


కాలేశ్వరం, 25 మే (హి.స.) సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా ఐదో రోజు కాళేశ్వరంలో భక్తుల సందడి నెలకొంది. శుభ సోమవారం భక్తులు పుణ్య స్నానాలకు, దర్శనాలకు తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పుణ్య నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తూ, సైకత శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీ కొనసాగుతున్నప్పటికీ, ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. భక్తులకు తాగునీరు, శానిటేషన్, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. అలాగే భక్తులు సహకరించి, అధికారులు సూచనలు పాటిస్తూ పుష్కర స్నానాలు నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏదైనా అస్వస్థతకు గురైతే వెంటనే 108, అత్యవసర వైద్య సేవల కేంద్రాల్లో వైద్య సేవలు తీసుకోవాలని తెలిపారు.

ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో కాళేశ్వరానికి తరలివస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమానికి చేరుకుంటున్న పుణ్యస్నానాలు ఆచరించి, నదీ తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పుష్కరాల సందర్భంగా భక్తులు నదిలో దీపాలు వదులుతూ, తమ పితృ దేవతలకు పిండప్రదానాలు, తర్పణాలు అర్పిస్తున్నారు. అనంతరం నదీ మాతకు అర్ఘ్యప్రదానాలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. పుష్కర ఘాట్ సమీపంలో ప్రతిష్టించిన సరస్వతి దేవి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక హారతులు ఇస్తున్నారు.

పుష్కర స్నానాల అనంతరం భక్తులు ప్రసిద్ధ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు, స్థానిక పోలీసులు ఘాట్లు, ఆలయ పరిసరాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.

యోగానంద సరస్వతి స్వామీజీ సోమవారం కాళేశ్వరం చేరుకుని సరస్వతి నదిలో పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించారు. వేద మంత్రోచ్చారణల మధ్య నదీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంకు చేరుకోగా ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా పార్వతి అమ్మవారికి, మహా సరస్వతి అమ్మవారికి విశేష హారతి సమర్పించారు.

తదనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయ తరఫున స్వామీజీ కి పండ్లు, శేష వస్త్రాలు సమర్పించి సన్మానించారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande