
కామారెడ్డి, 25 మే (హి.స.)
ప్లాస్టిక్.. ఇప్పుడు ఈ పేరు ఒక
మహమ్మారిగా మారింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న పనికీ ప్లాస్టిక్పైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల పర్యావరణం కలుషితం కావడమే కాకుండా, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని నూతన సర్పంచులు, తమ గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు నడుం బిగించారు. వారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
తాడ్వాయి మండలంలోని ఏండ్రియల్ గ్రామ సర్పంచ్ ప్లాస్టిక్ నిర్మూలనకు ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. గ్రామంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరిపారేసేందుకు సర్పంచ్ నర్సింలు ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. గ్రామస్థులు ఎవరైనా సరే,తమ ఇళ్లలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ఇస్తే.. వారికి బదులుగా ఒక స్టిల్ బాక్స్ను ఉచితంగా అందజేస్తున్నారు.పర్యావరణ పరిరక్షణ కోసం సర్పంచ్ తీసుకున్న ఈ చొరవను జిల్లా కలెక్టర్ స్వయంగా గ్రామాన్ని సందర్శించి ప్రశంసించారు.
ప్రజల్లో భిన్న అభిప్రాయాలు..
సర్పంచులు తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయాలపై తాడ్వాయి మండల ప్రజల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. మెజారిటీ ప్రజలు ఈ నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. గ్రామాలను రోగాల బారిన పడకుండా కాపాడుకోవడానికి, రేపటి తరం ఆరోగ్యానికి సర్పంచులు వేసిన ఈ మొదటి అడుగు ఎంతో అవసరమని వారు కొనియాడుతున్నారు. అయితే, మరికొందరు ప్రజలు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. ప్లాస్టిక్ను పూర్తిగా అరికట్టాలంటే కేవలం గ్రామాల స్థాయిలోనే కాకుండా, అసలు ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీలనే ప్రభుత్వం పూర్తిగా నిషేధించాలని కోరుతున్నారు. పట్టణాల్లో, మార్కెట్లలో ప్లాస్టిక్ సులభంగా అందుబాటులో ఉన్నంత కాలం..ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపడం కష్టమని వారు గుర్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు