
కలకత్తా, 25 మే (హి.స.)
మోదీ సర్కార్తో ఎంతటి సుదీర్ఘ రాజకీయ పోరాటానికైనా ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయని బంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇందుకోసం అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ఇండియా కూటమి సభ్యులు జూన్ మొదటి వారంలో సమావేశం అయ్యే అవకాశం ఉందని ఆదివారం తెలిపారు.
మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. చివరి వరకు మేము వెనకడుగు వేయం అని మమతా బెనర్జీ తన ఫేస్బుక్ లైవ్లో పేర్కొన్నారు. ఇదే వేదిక ద్వారా బీజేపీపై టీఎంసీ అభినేత్రి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. దాదాపు 150 అసెంబ్లీ నియోకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్కు వచ్చిన ప్రజాతీర్పును తారుమారు చేశారని ఆరోపించారు. గెలిచే స్థానాలను ఓడే స్థానాలుగా, ఓడిపోయే స్థానాలను గెలిచే స్థానాలుగా మార్చేశారు. అలా జరగకపోయి ఉంటే టీఎంసీకి 2020 నుంచి 230 స్థానాలు వచ్చేవి అని పేర్కొన్నారు.
తిప్పికొట్టిన బీజేపీ
మమతా బెనర్జీ ఆరోపణలను సీనియ్ బీజేపీ నాయకురాలు కేయా ఘోష్ తోసిపుచ్చారు. మమత ఎన్నికల ఫలితాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తున్నారని, కుట్ర కథల ద్వారా తన ఓటమిని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2011, 2016, 2021 ఎన్నికల్లో తమ పార్టీ సాధించిన విజయాలను ఒప్పుకున్న టీఎంసీ అధినేత్రి, ఇప్పుడు అకస్మాత్తుగా ఎన్నికల పద్ధతిపై ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నారని కేయా ఘోష్ విమర్శించారు. 'మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని గౌరవించడంలేదని, ఆమె దృష్టిలో గెలవడం అంటే బూత్ లాక్కోవడం (జామింగ్), హింస, రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడం మాత్రమే' అని కేయా ఘోస్ అన్నారు.
మమత విమర్శలు ఇవే!
ఎస్ఐఆర్ తర్వాత ఓటరు జాబితా నుంచి అనేక మందిని తొలగించారని, ఎన్నికల ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయని మమత బెనర్జీ మళ్లీ ఆరోపించారు.
మొదట్లో ఎస్ఐఆర్ ద్వారా దాదాపు 60 లక్షల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. ఆ తర్వాత చాలా పేర్లను మళ్లీ చేర్చినప్పటికీ, వివిధ దశల్లో అక్రమాలు, తప్పులు జరిగాయని మాకు సమాచారం ఉంది. అందుకే ఎన్నికల నిర్వహణపై అనుమానాలు ఉన్న నియోజక వర్గాల్లో టీఎంసీ న్యాయపరంగా కోర్టుకు వెళ్తుంది అని మమత పేర్కొన్నారు. ప్రత్యర్థులపై బీజేపీ రాజకీయ ఒత్తిడిలకు, బెదిరింపులకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. అయితే 'బంగాల్లో టీఎంసీని బీజేపీ ఎంతగా ఇబ్బంది పెడితే, దిల్లీలో ఆ కాషాయ పార్టీకి అంతకంటే ఎక్కువ సమస్యలు వస్తాయ్' అని మమత హెచ్చరించారు. బంగాల్లో ప్రభుత్వం మారిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలను, క్షేత్రస్థాయి నాయకులను టార్గెట్ చేస్తున్నారని ఈ మాజీ సీఎం ఆరోపించారు. అయితే వీటన్నింటికీ తట్టుకొని తాము నిలబడుతున్నామని పేర్కొన్నారు. టీఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలు ప్రభుత్వపరంగా అడ్డంకులుు ఎదుర్కొంటున్నాయని దీదీ ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిధిని బీజేపీ తగ్గిస్తోందని విమర్శించారు. కొంత మంది పార్టీ మారవచ్చు. కానీ ప్రజలు ఇప్పటికీ మాతోనే ఉన్నారు. మేము మళ్లీ పుంజుకుంటాం అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi