
సంగారెడ్డి, 25 మే (హి.స.)
ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని, వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులు, రోజురోజుకూ పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలకు విచ్చలవిడిగా జరుగుతున్న అడవుల నరికివేతే ప్రధాన కారణమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక కోటి 44 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన జిల్లా అటవీశాఖ కార్యాలయాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా బొంతపల్లి సమీపంలో అమృతవనం, హరితవనం పేర్లతో రెండు అత్యాధునిక ఎకో పార్కులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సంగారెడ్డి, పరిసర ప్రాంతాల ప్రజలు తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి వచ్చి ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ప్రజల నుంచి డిమాండ్ ఉంటే ఇక్కడ జంగిల్ సఫారీలను కూడా ప్రారంభిస్తాం. పార్కుల్లో సందర్శకుల కోసం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాం. భవిష్యత్తులో పర్యాటకుల స్పందనను బట్టి ఇక్కడే రాత్రి బస చేసేలా 'నైట్ స్టే' సౌకర్యాన్ని కూడా అటవీశాఖ కల్పించేందుకు సిద్ధంగా ఉంది అని తెలిపారు.పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని, నీటి కొరత, ఆహార కొరతతో మూగజీవాలైన అడవి జంతువులు సైతం తమ ప్రాణాలను కోల్పోతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అడవుల సంరక్షణ కోసం అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, రిజర్వ్ ఫారెస్టుల చుట్టూ పటిష్ఠమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసి జంతువులు గ్రామాల్లోకి రాకుండా రక్షణ కల్పిస్తున్నామని వివరించారు. ఫెన్సింగ్ లేని చోటే జంతువులు దారి తప్పి జనావాసాల్లోకి వస్తున్నాయని ఆమె అన్నారు. త్వరలోనే నారాయణఖేడ్, జహీరాబాద్లో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు స్థలాలనుపరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. చివరగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కనీసం ఒక్క మొక్కనైనా నాటి, దానిని సంరక్షించాలి అని ప్రజలకు ಆಮ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, జిల్లా అటవీశాఖ అధికారి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..