
ములుగు, 25 మే (హి.స.)
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఒకప్పుడు చిన్న పొదుపు సంఘాలుగా ప్రారంభమైన స్వయం సహాయక సంఘాలే నేడు తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. వారం రోజుల పాటు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళా వారోత్సవాల సందర్భంగా మంత్రి హైదరాబాద్లోని ప్రజాభవన్ నుంచి వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఇది మహిళా శక్తి మహోత్సవ కార్యక్రమమని, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ యాత్ర అని పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే మహిళా వారోత్సవాలు కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, మహిళల శక్తి, సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసం, సాధికారతను ప్రపంచానికి చాటి చెప్పే మహోత్సవమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా, ఉపాధి సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతోందని వివరించారు. మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఆర్థిక స్వావలంబనకు బలమైన తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..