
ఖమ్మం, 25 మే (హి.స.)
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంట వద్ద కొనసాగుతున్న సీతారామ ప్రాజెక్ట్ కాలువ టన్నెల్ నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలు, పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. యాతాలకుంట ప్రాంతంలో జరుగుతున్న ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయితే పరిసర ప్రాంతాల్లో సాగునీటి సదుపాయాలు మెరుగుపడటంతో పాటు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో నీటి వనరుల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం భారీ స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులను అమలు చేస్తోందని చెప్పారు. పనుల పరిశీలన సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడి ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ప్రజాధనం వృథా కాకుండా ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. టన్నెల్ పనుల్లో ఉపయోగిస్తున్న సామగ్రి నాణ్యతను పరిశీలించి, అవసరమైన చోట ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించాలని అధికారులకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..