
న్యూఢిల్లీ 25 మే (హి.స.)
దేశ ప్రజలకు మరోసారి ఇంధన ధరల షాక్ తగిలింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. పెట్రోల్పై లీటరుకు రూ.2.61, డీజిల్పై రూ.2.71 పెంపు అమల్లోకి తీసుకొచ్చాయి. కేవలం పదిరోజుల్లోనే నాలుగోసారి ఇంధన ధరల పెంపు కావడం గమనార్హం. మే 15 నుంచి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ.7.5 వరకు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వాల స్థానిక పన్నుల కారణంగా ధరల్లో ప్రాంతాలవారీగా తేడాలు ఉంటున్నాయి.
రెండు వారాల్లో నాలుగు సార్లు పెంపు
నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా మే 15న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 చొప్పున పెంచాయి. ఆ తర్వాత మే 19న లీటరుకు 90 పైసలు, మే 23న పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచారు. ఇప్పుడు మరోసారి భారీ పెంపు అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 2022 మే తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. 2022 ఏప్రిల్ నుంచి ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగగా, 2024 మార్చిలో సాధారణ ఎన్నికలకు ముందు లీటరుకు రూ.2 తగ్గించారు. ఇప్పుడు వరుస పెంపులతో సామాన్యులపై భారీ భారం పడుతోంది.
పెరుగుతున్న ముడి చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం, రూపాయి బలహీనపడటం, రిఫైనింగ్ ఖర్చులు అధికమవడం వల్ల దిగుమతి వ్యయం పెరిగిందని చమురు సంస్థలు చెబుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడం, హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాలో అంతరాయాలు ఏర్పడటం వల్ల ఫిబ్రవరి చివరి నుంచి ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు 50 శాతం కంటే ఎక్కువ పెరిగినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi