
విజయవాడ, , 25 మే (హి.స.)
ఆయిల్ కంపెనీల తీరుపై విజయవాడలోని పెట్రోల్ బంక్ యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా పెట్రోల్, డీజిల్ సరఫరా చేయకపోవడంపై అభ్యంతరం తెలిపారు. బంక్ యజమానులు తెలిపిన వివరాల ప్రకారం.. ధరలు పెరుగుతాయన్న సమాచారం మేరకు ముందుగానే ఆర్డర్లు ఇచ్చినా.. ఆయిల్ కంపెనీలు సరఫరా చేయలేదని ఆరోపించారు. దీంతో ఇప్పుడు పెరిగిన ధరల ప్రకారమే కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ కంపెనీల వల్ల నష్టపోయామని బంక్ యజమానులు వాపోయారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, ఆయిల్ కంపెనీలపై తగిన చర్యలు తీసుకోవాలని పెట్రోల్ బంక్ యజమానులు విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఇప్పటికే మూడు సార్లు ధరలను పెంచిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వరుసగా నాలుగో సారి ధరలను పెంచేశాయి. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.69కి , లీటర్ డీజిల్ ధర రూ.103.82కి చేరుకుంది. విజయవాడలోను లీటర్ పెట్రోల్ ధర రూ.117.75కి చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.43కు చేరుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ