సంక్షేమ పథకాల అమలు, జనగణన ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
సంక్షేమ పథకాల అమలు, జనగణన ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
Collector


నాగర్ కర్నూల్, 25 మే (హి.స.)

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ

పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, జనగణన ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సోమవారం ఉదయం విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న రెండు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. పనుల పురోగతి, నిర్మాణ నాణ్యత, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పట్టణ పారిశుద్ధ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో మురుగు నీటి శుద్ధి కేంద్రాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ, నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులు సద్వినియోగం అయ్యేలా పర్యవేక్షణ చేపట్టాలని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో ఎన్టీపీలు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తనిఖీల సందర్భంగా పట్టణంలోని నిర్మాణ పనులు సగంలోని ఆగిపోయిన వెజ్, నాన్-వెజ్ మార్కెట్ భవనాలను కూడా పరిశీలించారు. నాన్-వెజ్ మార్కెట్ భవనాన్ని మున్సిపల్ టౌన్ హాల్గా అభివృద్ధి చేసే ప్రతిపాదనలపై మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డితో చర్చించారు.

ప్రజలకు సామాజిక, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా టౌన్ హాల్ను అభివృద్ధి చేయాలని సూచించిన కలెక్టర్, పార్కింగ్ సౌకర్యం, తాగునీటి వసతి, పరిశుభ్రత, సమావేశాల నిర్వహణకు అనువైన హాల్, విద్యుత్ వంటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande