
శ్రీశైలం,, 25 మే (హి.స.)ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తి పీఠాలలో ప్రసిద్ధి చెందిన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవులు, సోమవారం కలిసిరావడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు.
దీంతో క్షేత్ర వీధులన్నీ భక్తులతో కిక్కిరిశాయి. ఎటు చూసినా జనరద్దీ కనిపించింది. స్వామిఅమ్మవార్ల దర్శనాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాల క్యూలైన్ల ద్వారా వెళ్లిన వారికి మూడు గంటల సమయం పట్టగా రెండు విడతలు మాత్రమే వీఐపీ బ్రేక్ స్పర్శ దర్శనాలకు ఆలయ అధికారులు అవకాశం కల్పించారు. కంపార్టుమెంట్లు క్యూలైన్లలో దర్శనానికి వేచి ఉన్న భక్తులకు వేడి పాలు, చల్లని మజ్జిగ, మంచినీరు, అల్పాహారం అందించారు. అన్నదాన భవనంలో శుచిశుభ్రత ప్రమాణాలతో తయారైన వంటకాలను ఈవో శ్రీనివాసరావు స్వయంగా భక్తులకు వడ్డించారు. దర్శనానంతరం బయటకు వచ్చిన భక్తులతో అభిప్రాయాలను తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV