
హైదరాబాద్, 25 మే (హి.స.)
తెలంగాణ విద్యుత్ రంగంలో ఒక కీలకమైన మార్పుకు రేవంత్రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'ఆర్డీఎస్ఎస్' (రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్) పథకంలో చేరేందుకు రాష్ట్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. అయితే, రైతాంగానికి ఊరటనిస్తూ వ్యవసాయ కనెక్షన్లకు ఈ స్మార్ట్ మీటర్ల నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. మిగిలిన గృహ, వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీలన్నింటికీ దశలవారీగా ఈ అధునాతన మీటర్లను అమర్చనున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ పథకానికి సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరిగినప్పటికీ, అప్పట్లో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం డిస్కంల (విద్యుత్ పంపిణీ సంస్థల) నష్టాలను తగ్గించడం, పారదర్శక బిల్లింగ్ వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్మార్ట్ మీటర్ల కొనుగోలు, ఏర్పాటుకు అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయని.. వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడబోదని అధికారులు స్పష్టం చేశారు.
స్మార్ట్ మీటర్ అనేది సాధారణ మీటర్ లాంటిది కాదు. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) సాంకేతికతతో పనిచేసే ఒక అధునాతన డిజిటల్ పరికరం. ఇది మీ ఇంట్లోని విద్యుత్ వినియోగ వివరాలను ఎప్పటికప్పుడు నేరుగా డిస్కంల సర్వర్లకు చేరవేస్తుంది. దీనివల్ల ప్రతి నెల మీటర్ రీడర్ మీ ఇంటికి రావాల్సిన అవసరం ఉండదు. మానవ తప్పిదాల వల్ల వచ్చే తప్పుడు, భారీ బిల్లుల ఇబ్బందులు వినియోగదారులకు తప్పుతాయి.
వినియోగదారులు ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా తమ ఇంట్లో రోజువారీ విద్యుత్ వినియోగం ఎంత ఉందో ట్రాక్ చేసుకోవచ్చు. ఎక్కడ పవర్ వేస్ట్ అవుతుందో గమనించి నియంత్రించుకోవచ్చు. ఏ ప్రాంతంలో లోడ్ ఎక్కువగా ఉందో కచ్చితమైన డేటా దొరకడం వల్ల లో-వోల్టేజ్ సమస్యలు, అకస్మాత్తు విద్యుత్ అంతరాయాలు తగ్గుతాయి. అలాగే విద్యుత్ దొంగతనాలను, లైన్ లాసెస్ ను డిస్కంలు సులభంగా గుర్తించగలవు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi