
అమరావతి, 26 మే (హి.స.)
లేపాక్షి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు జీతాలు పెంచాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి సవిత ఓ ప్రకటన విడుదల చేశారు. లేపాక్షి షో రూముల్లో అమ్మకాలు గణనీయంగా పెంచిన నేపథ్యంలో ఉద్యోగులకు బోనాంజా ప్రకటించారు. ప్రస్తుతమిస్తున్న మూల వేతనంపై 10 శాతానికి పైగా జీతాలు పెంచుతున్నట్లు మంత్రి సవిత తెలిపారు.
2025-26లో రూ.60.75 కోట్లకు అమ్మకాలు పెరిగాయని మంత్రి సవిత వెల్లడించారు. అమ్మకాలు పెంచిన ఉద్యోగులకు మంత్రి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఏడాది లేపాక్షి షో రూముల్లో అమ్మకాలు రూ.80 కోట్లకు చేరాలని సూచించారు. హస్త కళాకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. జీతాలు పెంచినందుకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు, మంత్రి సవితకు లేపాక్షి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ