అన్నమయ్య జిల్లా ఇసుక రీచ్ ల్లో దోపిడీ
అన్నమయ్య జిల్లా ఇసుక రీచ్ ల్లో దోపిడీ
అన్నమయ్య జిల్లా ఇసుక రీచ్ ల్లో దోపిడీ


26 మే (హి.స.)

మదనపల్లె(అన్నమయ్య):

అన్నమయ్య జిల్లాలోని ఇసుక రీచ్లలో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. పేద, మధ్య తరగతి ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెడుతూ కొన్ని నిబంధనలు పెట్టింది. అయితే ఈ నిబంధనలను పక్కనపెట్టి నిర్వాహకులు ఇష్టానుసారం వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆదాపూర్, కిచ్చమాంబాపురం, కోమంతరాజుపురం, కోమరూనీపల్లె, మదనగోపాలపురం, రాజంపేట, వేంపల్లె, నారాయణ నెల్లూరు, ఆర్.బోడుకుంట్లపల్లె-2, యర్రమనేనిపల్లె, బాలురాజుపల్లెలో ఇసుక రీచ్లు ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అదనంగా ఎలాంటి చార్జీలూ వసూలు చేయరాదని నిబంధన ఉంది.

కానీ టిప్పర్ లోడుపై రూ.రెండు వేలు అదనంగా వసూలు చేస్తున్నట్లు టిప్పర్ యజమానులు ఆరోపిస్తున్నారు. టిప్పర్ లోడుకు రూ.8 వేలు, డీజిల్కు రూ.12,500, టోల్గేట్స్ రూ.700, డ్రైవర్ బత్తా రూ.1,200, డీఈఎఫ్ ఆయిల్ రూ.500 చొప్పున మొత్తంగా 22,900 వసూలు చేయాల్సి ఉంది. అయితే రూ.25వేలు వసూలు చేస్తున్నారు. బాలురాజుపల్లె ఇసుక రీచ్లో నెల్లూరుకు చెందిన వైసీపీ నేతలు ఏజన్సీ నిర్వహిస్తున్నారు. ఒక టిప్పర్కు రూ.2,800 అదనంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పైగా నాసిరకం ఇసుక పంపుతున్నారన్న ఫిర్యాదులూ వస్తున్నాయి. దీనికితోడు తమ రీచ్కే రావాలని బెదిరిస్తున్నారని టిప్పర్ యజమానులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ చూపి న్యాయం చేయాలని కోరుతున్నారు.

మదనపల్లె సమీపంలో రీచ్ ఏర్పాటు చేయాలి

మదనపల్లె సమీపంలో రీచ్ ఏర్పాటు చేస్తే దూరంతోపాటు ఖర్చూ తగ్గుతుందని టిప్పర్ యజమానులు అభిప్రాయపడుతున్నారు. మేడికుర్తి, గుండ్లూరుల్లో ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న రీచ్లు జిల్లా కేంద్రానికి 150నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రయాణ సమయం, డీజిల్ ఖర్చులు అధికమవుతున్నాయని వాపోతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande