
హైదరాబాద్, 26 మే (హి.స.)
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై
బీజేపీ చేపట్టిన 'రైతు గోస యాత్ర'పై నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు వేముల వీరేశం(Vemula Veeresham) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలు రైతుల పేరుతో పసలేని, పనికిమాలిన యాత్రలు చేస్తూ రాజకీయం చేయడం మానుకోవాలని హితవుపలికారు. కమలం నేతలు యాత్రలు చేయాల్సింది తెలంగాణలో కాదని, ఢిల్లీలో అని ఎద్దేవా చేశారు. గత సంవత్సరం రాష్ట్రంలో పండించిన మొత్తం పంటను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు (లిఫ్ట్) చేసి ఉంటే నేడు రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని మండిపడ్డారు. తెలంగాణలో ఎంత ధాన్యం పండింది? అందులో కేంద్రం ఎంత కొనుగోలు చేసింది? అనే విషయాలపై ముందు బీజేపీ సమాధానం చెప్పాలని వేముల విరేశం డిమాండ్ చేశారు. రైతులకు ఎలాంటి మేలు చేయలేని బీజేపీ నేతలు, ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి లేనిపోని మాటలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో రైతులను అత్యధికంగా మోసం చేసిన ఏకైక పార్టీ బీజేపీనేనని దుయ్యబట్టారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందని, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని వీరేశం స్పష్టం చేశారు. ప్రస్తుతం హమాలీల కొరత వల్ల అక్కడక్కడా కొంత ఇబ్బంది ఎదురవుతున్నప్పటికీ, s సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నామని వివరించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, అకాల వర్షాలకు తడిసిన ధాన్యంతో సహా ప్రతి గింజను చివరి వరకు కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు