
నాగర్ కర్నూల్, 26 మే (హి.స.)
పాలమూరు.. రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావాలంటే లక్ష కోట్ల రూపాయలు కావాలి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రూ.80 లక్షల కోట్ల అంచనాలతో ప్రాజెక్టు పనులను ప్రారంభించి.. 28 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎక్కడి పనులు అక్కడే వదిలేసిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈనెల 30, 31వ తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల సందర్శనకు వస్తున్న నేపథ్యంలో మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజేష్, సంబంధిత శాఖ అధికారులతో కలిసి పాలమూరు... రంగారెడ్డి, కల్వకుర్తి ఇరిగేషన్ పరిస్థితులు పరిశీలన చేశారు. ఈ సందర్భంగా నార్లాపూర్ పీఆర్ఎల్ఎఎస్ పంపు వద్ద మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.
గత ప్రభుత్వం 80 వేల కోట్ల రూపాయల అంచనాలతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 28 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. మేము 90% పనులు పూర్తి చేసాము.. మిగిలిన పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేయడం లేదని బి ఆర్ ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మీకు సవాల్ విసురుతున్నాను పనులు ఎక్కడ పూర్తి అయ్యాయో చూపించండి.. రిజర్వాయర్ల మధ్య మెయిన్ పనులు కెనాల్స్ ఎక్కడివి అక్కడే ఉన్నాయి. నార్లాపూర్ వద్ద మొత్తం తొమ్మిది మోటార్లకు గాను ఒక్క మోటారు మాత్రమే బిగించి ఆగ మేఘాల మీద ఎన్నికల సమయంలో ప్రారంభించి చేతులు దులుపుకున్నారు. మూడింటిని ఇప్పుడు బిగించారు. మరో ఐదు కొత్త మోటార్లను బిగించవలసి ఉంది.
డిస్ట్రిబ్యూటరీ కాలువల ఏర్పాటుకు సంబంధించిన భూ సేకరణ, కాలువల పనులు అసలే చేయలేదు. అన్ని పెండింగ్ పెట్టి 90% పనులు పూర్తయ్యాయని అంటున్న బీఆర్ఎస్ నాయకుల్లారా.. ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు.. ఏ ముఖం పెట్టుకుని పాదయాత్రలు చేస్తారని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. . సమస్యలు అన్ని అధిగమించి నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు సంబంధించి నాలుగు లక్షల అరవై వేల ఎకరాలకు సాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..