తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి.. వడదెబ్బకు ఒక్కరోజే 77 మంది మృతి
తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి.. వడదెబ్బకు ఒక్కరోజే 77 మంది మృతి
Summer summer


హైదరాబాద్, 26 మే (హి.స.)

తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు

ఉగ్రరూపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. 45 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రమైన వడగాలులు (Heat Waves) వీస్తుండటంతో జనం విలవిలలాడిపోతున్నారు. ఎండల తీవ్రత, వడదెబ్బ (Heat Stroke) కారణంగా నిన్న (సోమవారం) ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 77 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఇందులో ఒక్క తెలంగాణలోనే 52 మంది మరణించగా, ఆంధ్రప్రదేశ్లో 25 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. అయితే, క్షేత్రస్థాయి నుంచి వస్తున్న అనధికారిక నివేదికల ప్రకారం.. గత వారం రోజుల వ్యవధిలోనే రెండు రాష్ట్రాల్లో దాదాపు 200 నుంచి 300 మంది వరకు వడదెబ్బకు బలైనట్టు సమాచారం.

రాబోయే మరికొన్ని రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల విపత్తుల నిర్వహణ సంస్థలు ప్రజలను అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అత్యవసరమైతే తప్ప వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు బయటకు రావొద్దని ఆరోగ్య శాఖ గైడ్లైన్స్ జారీ చేసింది. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు నిరంతరం నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS) ద్రావణం వంటి పానీయాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande